తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కరీంనగర్, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. అలాగే ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. బుధవారం ఉదయం 7.20 గంటల నుంచి 7.27 గంటల ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు.
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..
