వర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగులు అధికంగా కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా పొలాల దగ్గర ఉండే పుట్టలపై ఉంటాయి. గొడుగు ఆకారంలో ఉండటంతో.. వీటికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దసరా పండుగ సమయాల్లో వచ్చే పుట్టగొడుగులు చాలా రుచికరంగా ఉంటాయి. ఈ కూరలో మాంసాహారంతో సమానంగా టేస్ట్‌ను కలిగి ఉండటంతో అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొందరికి మాంసాహారం కంటే ఇవి అంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. వెరైటీస్ చేసుకుని కుటుంబమంతా ఆరగిస్తుంటారు.
అయితే పుట్టగొడుగులను తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటిల్లో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి పోషకాలను అందించడంతో పాటు అనారోగ్య సమస్యలను తరిమికొడతాయి. అలాగే వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బలహీనత, బలహీన జ్ఞాపకశక్తి వంటివి తగ్గడంతో పాటుగా శరీరానికి లాభాలను కలిగిస్తాయి. పుట్టగొడుగులు న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాకుండా అల్జీమర్స్, మానసిక రుగ్మతల నుంచి కాపాడుతుంది. వీటిల్లో ఉండే లినోలిక్ యాసిడ్ యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండర్‌గా పని చేసి హానికరమైన ప్రభావాన్ని తగ్గిస్తాయి. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవారు పుట్టగొడుగులను తినడం మంచిది.