ఎన్నికల మందు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ, రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశామని దుష్ప్రచారం చేసిన టీడీపీ కూటమి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, అది నిజమని చూపేందుకు విశ్వప్రయత్నం చేస్తోందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్ర అప్పులపై వాస్తవాలన్నీ బడ్జెట్ ప్రతుల్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పు రూ.6.46 లక్షల కోట్లు అని స్పష్టంగా పేర్కొన్నా ఏవేవో లెక్కలు కట్టి, ఇప్పుడు దాన్ని రూ.9.74 లక్షల కోట్లుగా చూపుతూ, తవ్వేకొద్దీ ఇంకా ఎంత బయట పడుతుందో అంటూ చెబుతున్నారని ఆయన ఆక్షేపించారు. తవ్వడానికి ఇదేమీ సొరంగమో, గనినో కాదన్న ఆయన, నిజానికి కాగ్ ప్రతినెలా ఆడిట్ చేస్తుందని, అన్ని వాస్తవాలు అందులో బయట పడతాయని చెప్పారు.
నిద్ర పోతున్న వారిని మేల్కొలపవచ్చు. కానీ, నిద్ర పోతున్నట్లు నటిస్తున్న వారిని మేల్కొలపలేం’ అన్న, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని, అన్ని వాస్తవాలు తెలిసినా, అన్నింటికి గత మా ప్రభుత్వాన్నే నిందిస్తూ, విమర్శలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగడుతూ.. గణాంకాలతో సహా, అన్నీ వివరించారు.