చారిత్రక నగరం వరంగల్ ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధాని గా మార్చేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయా? త్వరలోనే రాష్ట్ర రెండో రాజధానిగా అనౌన్స్ చేయబోతున్నారా? ఈ విషయంలో ప్రభుత్వం వేగం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. వరంగల్ ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు చేయగా తాజాగా ఇవాళ వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ధిపై మంత్రులు కీలక భేటీ నిర్వహించారు.
వరంగల్ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్‌లకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై మంత్రులు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి సీఎం ప్రధాన సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి వరంగల్ మేయర్ గుండు సుధారాణితోపాటు పలువురు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆర్‌అండ్‌బీ, ఎంఎయూడీ ఉన్నతాధికారులు, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్‌లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.