ఉప ఎన్నిక ఫలితాలపై ఎవరి లెక్కలు వారివే..

election-6.jpg

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదయింది. టీచర్స్‌ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మరణంతో బైఎలక్షన్‌ జరిగిన విషయం విదితమే కాగా బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్య జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు టీచర్లు బారులు తీరారు. యూనియన్ల వారీగా విడిపోయి ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు మద్దతు ఇచ్చారు. ఆరు కొత్త జిల్లాల పరిధిలో ఓటర్లు ఎమ్మెల్సీ ఎవరు అనేది డిసైడ్ చేస్తున్నారు. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, అల్లూరి జిల్లాలో 11 మండలాల్లో ఓటర్లు ఉన్నారు.

అయితే, పోల్ అయిన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓటు వస్తే వాళ్లు విజయం సాధిస్తారు. అలా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. గత ఎన్నికల్లో షేక్‌ సాబ్జీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో పీడీఎఫ్ తరఫున విజయం సాధించారు. ఈ సారి కూడా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. పోలింగ్‌‌ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను కాకినాడ జేఎన్టీయూకు తరలించారు. ఇక, ఈ నెల 9వ తేదీన అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ జరగనుంది. కాగా, గురువారం రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన విషయం విదితమే ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 16,737 మంది టీచర్లు ఉండగా ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 93 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.

Share this post

scroll to top