ఉన్నట్లుండి కంటి చూపు మసకబారుతోందా? ఒక్కోసారి తల గిర్రున తిరగడమో, తలనొప్పితో పరిసరాల సగం సగం కనిపించడమో వంటి అనుభవాలు ఒకటికి రెండుసార్లు ఎదురయ్యాయా? అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించండి. డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోండి. ఎందుకంటే శరీరంలో మధుమేహం ప్రారంభమైతే కూడా అచ్చం ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం చాలామంది దీనిబారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడమనే పరిస్థితి కంటి ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తోంది.
దృష్టి లోపం..
మన శరీరంలో డయాబెటిస్ ప్రారంభం అయితే పలు లక్షణాలను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మునుపటి మాదిరి కళ్లు స్పష్టంగా కనిపించకపోవడం, కంటి చూపులో మార్పులు సంభవించడం సంకేతాలు మీలో కనిపిస్తే అనుమానించాల్సిందే. ఎందుకంటే మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అంతేకాదు అప్పటికే షుగర్ పేషెంట్లు అయిన వారిలో రక్తంలో చక్కెరస్థాయిలు హెచ్చు తగ్గులలకు గురికావడంవల్ల కూడా ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
కళ్లల్లో నొప్పి..
మధుమేహం ప్రారంభంలోనే నరాలపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే కళ్లల్లో నొప్పి లేదా ఒక విధమైన ఒత్తిడిని అనుభవిస్తు్న్న భావన ఏర్పడుతుంది. మీలో ఆ సంకేతాలు కనిపిస్తే మధుమేహం బారిన పడి ఉండవచ్చు.
కళ్ల చుట్టూ వాపు..
కళ్లలో ఒత్తిడి వంటి భావనతోపాటు కళ్లచుట్టూ వాపు కనిపించడం కూడా మధుమేహం ప్రారంభ లక్షణంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఎందుకంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి కంటి కణాలపై ప్రభావం పడినప్పుడు ఇలా వాపు సంభవిస్తుంది. దీంతో కనురెప్పలు ఉబ్బినట్లు కనిపిస్తాయి.
బ్లర్‌గా కనిపించడం..
రాత్రిపూట ఇంట్లో అయినా, బయట అయినా వెలుతురులో ఉంటే కళ్లకు ఇబ్బందిగా అనిపించడం, బ్లర్‌గా కనిపించడం, కళ్లు గుంజడం వంటి లక్షణాలు కనిపించినా అవి డయాబెటిస్ ప్రారంభ సంకేతం కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలు మీలో కనిపిస్తే గనుక జాగ్రత్త పడాలి.