ఇప్పటి వరకు ఇరానీ చాయ్ రూ.15 నుంచి 20 రూపాయల వరకు ఉన్నది. అయితే గత మూడు రోజులుగా దీని ధరను 25 రూపాయలు చేశారు. ఇటీవల లెబర్ చార్జీలు పెరగడంతోపాటు టీపొడి, చక్కెర, చాయ్ పౌడర్ ధరలు పెరిగాయని ఈ కారణంగానే గిట్టుబాటు కాకపోవడంతో ధరలు పెంచామని హోటల్ నిర్వహకులు పేర్కొంటున్నారు. కస్టమర్లు తమ సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. మరోవైపు నాలుగు చాయ్ లకు రూ.100 బిల్లు అవుతుండటంతో ఇరానీ చాయ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
ఉదయం బెడ్ నుంచి లేచినప్పటి నుంచి రాత్రి వరకు చాయ్ తో నాలుకను తడపకపోతే నిద్రపట్టదు. అంతలా చాయ్ రుచికి అలవాటుపడ్డారు తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా హైదరాబాద్ లో లభించే ఇరానీ చాయ్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో హైదరాబాదీలు రోజుకు ఒక్కసారైనా ఇరానీ చాయ్ ని గుటకలు వేయకుండా ఉండలేరు. అలాంటి వారికి హోటల్ యజమానులు చేదు వార్తను అందించారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఇరానీ చాయ్ ధరను 25 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీ ప్రియులు లబోదిబోమంటున్నారు.