హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్ టికెట్ ఛార్జీల పెంపుపై గత కొంతకాలంగా వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఎల్ అండ్ టీ అధికారులు మెట్రో నష్టాలను నివారించుకునేందుకు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు గతంలో ఎఫ్ఎఫ్‌సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మెట్రో టికెట్ రేట్లు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మే 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. అనంతరం పెంచనున్న మెట్రో టికెట్ ఛార్జీల పెంపును మే 10వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎఫ్ఎఫ్‌సీ రిపోర్టు ఆధారంగా మెట్రో టికెట్ చార్జీలను పెంచుకునే హక్కు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి ఉంటుందని ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. మెట్రో రైల్వే యాక్ట్ 2002 ప్రకారం టికెట్ రేట్లను సవరించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఈ ఏడాది బెంగళూరులో 50శాతం చార్జీలు పెంచారని ఆయన గుర్తు చేశారు. అందువల్లనే ఇప్పుడు హైదరాబాద్‌లో 25 శాతం నుంచి 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.