కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని ట్విటర్‌లో పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతికి వస్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారని ఆరోపణలు చేశారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష ఆర్తనాదాలు వినిపించాయని అన్నారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు.
తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని అన్నారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని, వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.