ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఓ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షలు చేపట్టారు. ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అధికారులతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లు సమావేశంలో పాల్గొన్నారు. వీరందరూ దేశ భద్రతకు సంబంధించి ప్రస్తుత పరిణామాలపై పూర్తి సమీక్ష చేపట్టారు.
ముఖ్యంగా పాక్ రెచ్చగొట్టే దాడులు, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు, డ్రోన్ దాడుల విషయాలు చర్చలో ప్రధానంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారత్ పై జరిగే ఏదైనా ఉగ్రదాడిని ‘యుద్ధ చర్యగా’ పరిగణించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గట్టి సంకేతాలిచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ వర్గాల ప్రకారం ఉగ్రదాడులను ఇక నుంచి యుద్ధ చర్యగా పరిగణించాలని నిర్ణయం తీసుకుందని, అలాగే తీవ్రవాద చర్యలను సహించేది లేదని తెలుస్తుంది. అలాగే, పాకిస్తాన్‌లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలని, ఉగ్రవాద చర్యలను సరైన రీతిలోనే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.