శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ రైడ్స్..

sri-chaithnya-11.jpg

శ్రీచైతన్య కాలేజీల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో రూ.5 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అడ్మిషన్లు, ట్యూషన్‌ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించిన అధికారులు ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇదే అదునుగా యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని నిత్యం ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

ఇదే విషయమై విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు ఏకకాలంలో దేశంలోని పలు నగరాలలో ఉన్న ఈ కాలేజీలపై దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.5 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీచైతన్య సంస్థలకు సంబంధించిన లావాదేవీల సాఫ్ట్‌వేర్‌ను ఐటీ అధికారులు పరిశీలించారు. ఇదిలా ఉంటే 2020లోనూ శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు జరిగాయి. ఆ సోదాల్లో రూ.11 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం రెండో రోజు కొనసాగుతన్న సోదాల్లో శ్రీచైతన్య కాలేజీల ట్యాక్స్‌ చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం అందుతుంది. కాగా ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share this post

scroll to top