ఖాకీ చొక్కా వేసుకోగానే రాష్ట్రానికి సుప్రీం అనుకుంటున్నారేమో అర్థం కావడం లేదని వైయస్ఆర్‌సీపీ యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసులు ప్రవర్తించిన తీరుని ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ నేతలను ఎలా అణగదొక్కలా అని ఆలోచిస్తోందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడకుండా విడుదల రజినీ పట్ల చిలుకలూరిపేట సీఐ ప్రవర్తించిన తీరు దుర్మార్గమన్నారు. కొందరు పోలీసులు అధికార పార్టీ అండ చూసుకొని విర్రవీగుతున్నారని, బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి ఓ పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏ పోలీసు అధికారి ఏ రకంగా ప్రవర్తించారన్నది తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటామని, అధికార పార్టీకి కొమ్ము కాసిన ప్రతి పోలీస్ అధికారి రేపు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా లెక్క అప్పజెప్పవలసిన రోజు వస్తుందని హెచ్చరించారు. ఇది గుర్తెరిగి పోలీసులు వ్యవహరిస్తే మంచిదని జక్కంపూడి రాజా హితవు పలికారు.
దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు..
