సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలతో రోజురోజుకు ఆదాయం తగ్గుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్నా, పాతవి అమ్మాలన్నా జనం భయపడుతున్నారని చెప్పారు. తమవి సంపద పెంచే ఆలోచనలని, మీవి ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలని మండిపడ్డారు. తాము బంగారు బాతును చేతిలో పెట్టామని, మీరు పదినెలలకే చిప్ప చేతిలో పేట్టారని విమర్శించారు.
హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో సొంతింటి కలలు కలగానే మిగిలిపోయాయన్నారు. మూసీ ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులయ్యాయని చెప్పారు. కాసులపై నీ కక్కుర్తి నిర్ణయాలు రాష్ట్రన్ని అధోగతిపాలు చెస్తున్నాయని దుయ్యబట్టారు. నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, నేడు బోసిపోయాయని విమర్శించారు. నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమేనంటూ ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్భాగ్యపు పాలనకు ఇదిగో ఈ లెక్కలే సాక్ష్యాలంటూ ట్వీట్ చేశారు.