ఎన్టీఆర్ చరిత్ర మరువని అజరామరుడు..

sr-ntr-18.jpg

తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకూ తరతరాలుగా గుర్తిండి పోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఎన్టీవోడి గర్జన నుంచి పుట్టిన వేడిగాలి దావానలంలా వ్యాపించి, తెలుగు వారి వాడి, వేడి, పౌరుష ప్రతాపాల ప్రభావాన్ని విశ్వవ్యాపితం చేసింది. అతడే ఒక సైన్యం, అతడే ఒక ప్రేరణ, అతడి మాటే వేదం, ఆయన పిలుపే ప్రభంజనం, అన్ని యుద్ధాలు తానే చేశారు, అన్ని ప్రయాణాలు తానే సాగించారు, అన్ని తానై ముందుకు నడిచి అందరిని తన వెంట నడిపారు, ఆయన మాట శిరోధార్యంగా మలిచారు ఎన్టీఆర్.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని తలచి సంక్షేమ రాజ్యం సృష్టించి సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు పేరు ప్రఖ్యాతులు పొందారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధ్రువతారగా వెలుగొంది, తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనసులను కొల్లగొట్టారు. 6 దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎదురులేని రారాజుగా వెలుగొందారు. అందమైన రాముడిగా, కృష్ణుడిగానే కాదు. ఠీవీ, రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు పోషించి ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జీవం పోశారు. అతని శ్వాస, ధ్యాస, ఘోష తెలుగు. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు జ్యోతికి జీవం పోసిన ప్రధాత. ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. అక్షర సేధ్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు ఎన్టీఆర్.

Share this post

scroll to top