రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన పాస్టర్ మృతి పై విచారణ కొనసాగించాలని ఆదేశించారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 24న హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు అన్ని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పాస్టర్ ప్రవీణ్ ఎన్టీఆర్ జిల్లా లోకి ప్రవేశించిన తర్వాత రెండు సార్లు బైక్ ప్రమాదం జరిగింది.
అయినప్పటికి పాస్టర్ తన బైక్‌ను అదుపుచేయలేని స్థితిలో కూడా డ్రైవ్ చేసుకుంటూనే రాజమండ్రి వెపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది. దీంతో ఆయన మృతిపై ఉన్న అనుమానాలన్ని పటాపంచాలవ్వడంతో పాటు కేసు కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ మృతి పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టిన పోలీసులు, ఒకరు అరెస్ట్ చేశారు. అలాగే ఆయనను హత్య చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి వివరాలను సైతం పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చివరకు రోడ్డు ప్రమాదంగా తేలిపోయింది.