థియేటర్ల బంద్ వ్యవహారం, పవన్ కల్యాణ్ లేఖ తదితర అంశాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు మాకు పర్సంటేజ్ అయితే బాగుంటుంది ఇలా అయితే థియేటర్స్ నడపలేము అని మాట్లాడుకున్నారు. ఒక సంవత్సరంలో 150 సినిమాలు విడుదలయితే 90 సినిమాలు అందరూ పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ లేదా పర్సంటేజ్ బేసిస్ లో ఆడుతున్నాయి. ఇలా ఆడుతున్న సమయంలోనే కొన్ని ఇబ్బందులు వచ్చాయి.
అప్పుడే ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ లో పర్సంటేజ్ సిస్టం కోరుకున్నారు. అది హైదరాబాదులో నిర్మాతలకు కమ్యూనికేట్ అయితే ఏప్రిల్ 26న గిల్డ్ మీటింగ్ జరిగింది. వాళ్లది వర్కౌట్ అవ్వకుండా అప్పుడు జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ ఆపుతాము అని ఈస్ట్ గోదావరి థియేటర్స్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు మధ్య జరిగిన సంఘటన ఇది. అప్పుడు నిర్మాతలం మేమందరం కలిసి ఎందుకు వాళ్లకు వర్క్ అవుట్ అవ్వడం లేదు. ఒక 6 మంత్స్ నుంచి వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకురమ్మని చెబుదాం. అలా వచ్చినప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు తెలుస్తాయి. మేము అన్ని టెరిటరీల్లో ఉన్నాం. ఫస్ట్ వీక్ బాగా కలెక్షన్స్ వస్తే రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్స్ తగ్గిపోగానే పర్సంటేజ్ ఇస్తున్నాము అది వాళ్లకు బాగా కష్టమైంది అది అందరికీ తెలుసు.
దానికి సొల్యూషన్ రావట్లేదు చాలా రోజులుగా నిర్మాతలము కూడా దీనిమీద మాట్లాడుకుంటున్నాం. ఆ టైంలో ఎప్పుడు 26న గిల్డ్ మీటింగ్ జరిగింది. అప్పటికి హరిహర వీరమల్లు సినిమా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. తెలంగాణ స్టేట్ మొత్తం 370 సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి. SVC, మా అసోసియేట్స్ అన్నీ కలిపి 30 థియేటర్స్ నా దగ్గర ఉన్నాయి. ఏషియన్ సునీల్, సురేష్ కంపెనీల్లో 90 థియేటర్లు ఉన్నాయి. మీడియా వాళ్లకు నేను క్లారిటీ ఇస్తున్నాను 370 సింగిల్ స్క్రీన్స్ లో మా దగ్గర ఉన్నవి కేవలం 120 మాత్రమే’.