టాలీవుడ్ లో ఇప్పుడు ఎగ్జిబిటర్ల వివాదం నడుస్తోంది. థియేటర్లు అద్దె ప్రాతిపదికన నడిపించడం కుదరదని కచ్చితంగా తమకు పర్సెంటేజీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. దీనిపై నిర్మాతల మండలి ఇప్పటికే ఓ సారి సమావేశం అయింది. రేపు మరోసారి సమావేశం కాబోతోంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా నిర్మాత శ్రీనివాస్ కుమార్ అలియాస్ ఎస్కేఎన్ దీనిపై స్పందించారు. ఘటికాచలం టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. ఎగ్జిబిటర్లు సినిమా ఇండస్ట్రీకి సహకరించాలి. వారి సమస్యలను కూడా సినిమా పెద్దలు ఆలోచిస్తారు. ఈ సమయంలో ఇండస్ట్రీపై కక్ష కట్టొద్దు.
ఎందుకంటే ఇండస్ట్రీ ఐసీయూలో ఉంది. ఇప్పుడు దానికి యాంటిబయోటిక్స్ ఇవ్వాలి. సినిమాలో పర్సెంటేజీ కాదు గానీ థియేటర్లలో ప్రేక్షకుల పర్సెంటేజీ పెంచడంపై నిర్మాతలు ఆలోచించాలి. ఎందుకంటే థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. మరీ ముఖ్యంగా టికెట్ ధరలు, థియేటర్ లో ఫుడ్ ధరలు ప్రేక్షకులను సినిమాలకు దూరం చేస్తున్నాయి. కాబట్టి టికెట్ ధరలను తగ్గిస్తే బెటర్. మార్నింగ్ షోకు లేదంటే వీకెండ్స్ లో టికెట్ రేట్లు తగ్గిస్తే ఇంకా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఈ విషయంలో అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత ఎస్కేఎన్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.