నేడు, రేపు భారీ వర్షాలు..

varsham-04.jpg

రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రదేశాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇక నిన్న కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. ఎక్కడ చూసినా నీళ్లు పొంగిపోర్లాయి. ఈ క్రమంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రమట్టానికి 0.9కి.మీ ఎత్తులో ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కొనసాగుతుండడంతో మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. తెలంగాణ లోని 23 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

పలుచోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని వాతావరణ అధికారులు సూచించారు. ఈ క్రమంలో తెలంగాణలోని ములుగు, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Share this post

scroll to top