ఒకపక్క విజయవాడ వాసులు భారీ వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరద బీభత్సానికి విజయవాడలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గడిచిన ఇన్నేళ్ళలో ఏరోజూ ఇలాంటి పరిస్థితి లేదు. అంతలా విజయవాడ నీట మునిగింది. చాలా చోట్ల ఇళ్ళు నీట మునగడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారులు కూడా బాధితులకు సహాయం అందజేస్తున్నారు. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమవ్వడంతో జనాలు ఇళ్ల లోంచి బయటకు రాలేని పరిస్థితి. మనిషిలో సగం లోతు వరకూ నీరు చేరడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పడవల ద్వారా బాధితులకు ఆహారం అందజేస్తున్నారు.
అయితే ఇంత దయనీయ పరిస్థితుల్లో కూడా కొందరు ప్రైవేట్ బోటు యజమానులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఉచితంగా సేవ చేయడానికి వస్తుంటారు. అందరికీ అంత స్థోమత ఉండదు కాబట్టి కొంత డబ్బులు అయితే తీసుకుంటారు. కానీ విజయవాడలోని కొందరు ప్రైవేటు బోటు యజమానులు మాత్రం.. ఇదే అవకాశం మళ్ళీ రాదు అనేలా ప్రవర్తిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏకంగా రూ. 1500 నుంచి రూ. 4 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆపద సమయంలో ఇంత దారుణంగా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు బోట్ల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.