భారీ అంచనాలతో ఉగాది కానుకగా రిలీజైన రాబిన్ హుడ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో శ్రీలీలకు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే వరుసగా పరాజయాలు ఎదురవుతున్నప్పటికీ ఈ యంగ్ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోందీ అందాల తార. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం సిక్కింలో ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీ కరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కూడా పాల్గొంటున్నారు.
తాజాగా సినిమా యూనిట్ అంతా కలిసి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా కొన్ని బహుమతులు అందజేశారు. మూవీ షూటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని చిత్ర బృందానికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సిక్కిం సీఎంఓ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.