తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత సిట్ దర్యాప్తుకు ఆదేశించడంపై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వ సిట్ దర్యాప్తు కొనసాగింపుపైనా గురువారం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.
లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తు కొనసాగింపుపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై సమీక్షకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ మేరకు సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక మరో దర్యాప్తు చేపట్టాలా అన్న అంశంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరింది. అక్టోబర్ 3న జరిగే విచారణలో సొలిసిటర్ జనరల్ తన అభిప్రాయం చెప్పనున్నారు. దాని ఆధారంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అంటే కేంద్రం ఇచ్చే అభిప్రాయం ఆధారంగా సిట్ దర్యాప్తు లేదా సీబీఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఓవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కంగుతిన్న చంద్రబాబుకు ఇది మరో సమస్యగా మారింది.