ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తోంది. గత ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని ముందే కచ్చితంగా చెప్పిన వారిలో ఒకరైన ప్రవీణ్ పుల్లట రెండు జిల్లాల్లో ఎన్డీయే తాజా పరిస్దితిపై తన రైజ్ సంస్ధ సర్వే అంచనాలను ఎక్స్ లో షేర్ చేశారు. కాకినాడ ఎంపీ సెగ్మెంట్ లో తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ , రూరల్ లో ఎమ్మెల్యేలు, ప్రభుత్వంపై అసంతృప్తి అధికంగా ఉందని ప్రవీణ్ తన విశ్లేషణలో తెలిపారు. అలాగే పిఠాపురంలో ఎక్కువ ఆశలు పెట్టుకునే పరిస్దితి లేదని దాదాపుగా చెప్పేశారు. పెద్దాపురంలో మాత్రం కూటమిపై మిశ్రమ స్పందన కనిపిస్తోందన్నారు. తన రైజ్ సర్వే పూర్తి గణాంకాలు ఐవీఆర్ఎస్ ఆడియో రికార్డులు కూడా మీ కోసం అందిస్తామని ఎక్స్ లో ప్రవీణ్ ప్రకటించారు.
ఇందులో ఈ మధ్యే విడుదల చేసిన విజయనగరం జిల్లా రైజ్ సర్వేలో విజయనగరం ఎంపీ సెగ్మెంట్లో బొబ్బిలి, రాజాం అసెంబ్లీ స్థానాలు తప్పితే మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్త స్థాయి అధికంగా ఉందని ప్రవీణ్ తెలిపారు. అలాగే విజయనగరం, గజపతినగరం అసెంబ్లీ స్థానాలు యావరేజ్ జాబితాలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రకటించారు. గతంలో ఇదే ప్రవీణ్ పుల్లట ఎన్నికల్లో కూటమి కచ్చితంగా గెలుస్తుందని పదుల సంఖ్యలో సర్వే విశ్లేషణలు విడుదల చేశారు. వీడియోలు కూడా చేశారు. అవన్నీ దాదాపుగా నిజం అయ్యాయి కూడా. దీంతో కూటమి పార్టీలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల ఆందోళన వ్యక్తమవుతోంది.