తెలంగాణ రాష్ట్రంలో 2జీ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు రెడీగా ఉంది. అతి త్వరలోనే రాష్ట్రంలో రెండో జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తొలి దశలో భాగంగా వెయ్యి కోట్ల పెట్టుబడులకు స్వచ్ఛ్ బయో ఒప్పందం కుదుర్చుకుంది. స్వచ్ఛ్ బయో రాకతో కొత్తగా 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్లాంట్ ఏర్పాటుతో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు పొందే అవకాశం లభించనుంది. స్వచ్ఛ్ బయో కంపెనీతో రాష్ట్రంలో సుస్థిరమైన, పర్యావరణ వృద్ధికి దోహదపడనుంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ అధికార ప్రతినిధి బృందంతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ్ బయో ఛైర్ పర్సన్ ప్రవీణ్ పరిపాటితో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ వికేంద్రీకృత అభివృద్ధి ఆకట్టుకుందని కంపెనీ ఛైర్మన్ ప్రవీణ్ పరిపాటి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవటం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్నిప్లాంట్లతో బయో ఫ్యూయల్స్ హబ్‌గా మార్చుతామని తెలిపారు.