ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, ఆలూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 27న దళితనాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యాడు. ఆయనను చిప్పగిరి గుంతకల్లు శివారులో హత్యచేశారు. పని నిమిత్తం గుంతకల్లు వెళ్లిన లక్ష్మీనారాయణ తిరుగు ప్రయాణంలో తన వాహనంలో స్వగ్రామం చిప్పగిరికి వస్తుండగా గుంతకల్లు శివారులో ఉన్న రైల్వే గేట్ సమీపంలో ఆయను టిప్పర్‌తో ఢీకొట్టారు. అనంతరం మారణాయుధాలతో నరికి హత్య చేశారు.
రైల్వే టెండర్లు, కమిషన్ల విషయంలో చిప్పగిరి లక్ష్మీనారాయణకు , మాజీ మంత్రి, ప్రస్తుత గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణల మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రైల్వే కాంట్రాక్టు కమీషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తానని హతుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ బెదిరించినట్లు తెలిసింది. దీంతో అతనిమీద నారాయణ కక్ష పెంచుకున్నాడు. అందులో భాగంగా తనకు పరిచయం ఉన్న గౌసియా, పెద్దన్న, రాజేష్‌లను ఆశ్రయించాడు. వారికి చిప్పగిరి లక్ష్మీనారాయణకు భూ వివాదాలు, ఇతరత్ర విషయాల్లో మనస్పర్థలు ఉండటంతో అందరు కలిసి హత్య చేసేందుకు పథకం పన్నారు. అలా గత నెల 27న హత్య చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే రాజేష్, గౌసియా, సౌభాగ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.