తెలంగాణ రాష్ట్రంలో రాగల కొద్ది గంటల్లో వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రస్తుత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడే ప్రమాదం, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన..
