వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో భవనంపై కూడా తమ ప్రాణాలకు రక్షణ లేదని భావించిన ఓ మహిళ తన నలుగురు పిల్లలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు సహాయం కోసం హాహాకారాలు చేసింది. ఎంత మొత్తుకున్నా వారిని ఆదుకొనే నాథుడే కరువయ్యాడు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన ఇది. చివరికి ఆ మహిళ మధిరలోని తమ బంధువులకు కాల్ చేయగా.. అక్కడినుంచి వచ్చిన గజ ఈతగాళ్లు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మరో ఘటనలో మున్నేరు బ్రిడ్జిపై 9 మంది మధ్యాహ్నం ఎప్పడో చిక్కుకుంటే.. రాత్రి పది గంటల వరకూ వారిని కాపాడేవారే లేకపోయారు. ఆఖరికి ఓ జేసీబీ డ్రైవర్ తన ప్రాణాలకు తెగించి ఆ తొమ్మిదిమందిని కాపాడారు. మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కూడా వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వ్యవస్థ మొ ద్దు నిద్ర పోయినట్టు జరిగిన ఘటనలు తెలియజేస్తున్నాయి.