నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెంట్లవల్లి గ్రామంలోని 499 మంది రైతుల్లో ఒక్కరంటే ఒక్కరికీ రుణమాఫీ కాకపోవడం పచ్చి మోసం కాకపోతే మరేంటని ప్రశ్నించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిసెంబర్ నుంచి ఆగస్టు 15 దాకా డెడ్‌లైన్లు పెట్టిన సీఎం నేటికీ వీరికి రుణమాఫీ ఎందుకు కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన్ ఎక్స్ లో ట్విట్ చేశారు. పావు శాతం కూడా మాఫీ చేయకుండా వంద శాతం అయిపోయినట్టు ఫోజులు కొట్టిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా వెంటనే పెంట్లవెల్లి రైతుల గోడు తీర్చాలని అన్నారు.
కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి సింగిల్ విండోలో 499 మంది రైతులు రుణాలు తీసుకుంటే ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. మూడు విడతల్లో ఒక్క రైతుకు కూడా మాఫీ కాకపోవడంతో వారు ఆవేదన చెందారు. వినతులిచ్చినా, కార్యాలయం చుట్టూ తిరిగినా నెల రోజులుగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పీఏసీఎస్ ముందు రైతులు ధర్నాకు దిగారు. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ ట్విట్ చేశారు.