అధిక పని ఒత్తిడితో ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్‌లో స్పందించారు. చాలా విషపూరితమైన, నిస్సారమైన పని విధానం వల్ల.. మరో యువ జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పుణెలో అన్నా సెబాస్టియన్ మృతి .. పనిప్రదేశాల్లో ఉండే వత్తిడిని గుర్తు చేస్తోందన్నారు. తీవ్ర వత్తిడిలో డెడ్‌లైన్ల కోసం పనిచేయడం సరికాదు అని, గౌరవంతో పనిచేయాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వాలంటే.. ప్రస్తుతం చట్టపరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. దీనితో పాటు అధిక పనిని గొప్పగా చిత్రీకరించే విధానాన్ని నిర్మూలించాలన్నారు. మీ జీవితాలే ముఖ్యమన్న విషయాన్ని కార్పొరేట్ ప్రపంచంలోని యువ మిత్రులు గ్రహించాలని కేటీఆర్ తన ట్వీట్‌లో కోరారు. సంస్మరణ ప్రకటనల కన్నా వేగంగా ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ అవుతుంటాయని, కానీ మీ అంతిమ సంస్కారాలకు హాజరయ్యే సమయం మీ బాస్‌లకు ఉండదని కేటీఆర్ పేర్కొన్నారు. మీరు బాధలో ఉన్న సమయంలో మీ కుటుంబమే మీతో ఉంటుందని తెలిపారు.