వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్ కూల్‌కూల్ అయిపోయింది. కానీ పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. ఎండలు మండిపోతున్న వేళ శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో పలుచోట్ల వర్షం కురవగా మరికొన్నిచోట్ల వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. పోచమ్మ బస్తీలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. దాంతో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఏపీలోని 18 మండలాల్లో శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం-7, పార్వతీపురం మన్యం-5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం మన్యం జిల్లా -4 అల్లూరి జిల్లా-2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రి లో 40.9°C, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6°C, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2°C, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 28 మండలాల్లో ఓ మోస్తరు వడగాల్పులు వీచాయి.