చిన్నారులు ఇద్దరూ పదేళ్లలోపు వారే కావటంతో ఎలా ఉన్నారో అంతుబట్టక నిద్రాహారాలు లేకుండా కుమిలిపోతోంది. అధికారులకు తన మొర చెప్పుకుందామని వెళ్తే వినిపించుకునే నాథుడే లేకుండా పోయాడని కన్నీరు మున్నీరు అవుతోంది. ‘నా కన్నీటిని ఎవరూ పట్టించుకోవటంలేదు. కడుపున పుట్టిన బిడ్డలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వ పెద్దనా సమస్యను ఆలకించడం లేదు’ అంటూ రోదిస్తోంది!! వరద ప్రాంతాల్లో బాధితుల దుస్థితికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే.
ఎవరిని కదిలించినా ఇలాంటి దీన గాథలే! సహాయ చర్యల్లో సర్కారు వైఫల్యంతో పలుచోట్ల మహిళలు, పిల్లలను వారి బంధువులు, వలంటీర్లు పీకల లోతు నీళ్లలో భుజాలపైకి ఎక్కించుకుని కాపాడి తెస్తున్న దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. వరద నీటిలో వస్తుండగా కాళ్లకు పాములు, విష జంతువులు చుట్టుకోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు.