వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల పట్ల కొంత నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్కా ఇకపై జరిగేది మరో లెక్కా అంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి వారంలో మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిది చేసి, ప్రతీ రోజు రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటానని స్పష్టం చేశారు.
మండల స్థాయి నుంచి బూత్ కమిటీల వరకు పార్టీ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుందని ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. రాజకీయాల్లో ఉండే నాయకులకు విశ్వసనీయత, వ్యక్తిత్వం ఉండాలని అలాంటి వారికే విలువ ఉంటుందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో క్యాలెండర్ను విడుదల చేసి ఆ నెలలో ప్రజలకు నేరుగా బటన్ ద్వారా నిధులు విడుదల చేసి ఆదుకున్నామని వెల్లడించారు.