వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకే ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీతో శంకుస్థాపనలు చేయిస్తోందని ఆయన ఆక్షేపించారు. ఈ ప్రభుత్వంలో ఆరున్నర నెలల్లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనతో సీఎం చంద్రబాబు షో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారని తెలిపారు. అంతకు ముందు చంద్రబాబు పాలన కన్నా, గత ప్రభుత్వంలో వైయస్ జగన్‌గారి పాలనలోనే పారిశ్రామిక రంగం గణనీయంగా పురోగతి సాధించినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. మరోవైపు కమీషన్ల కోసం టీడీపీ నాయకుల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు హడలెత్తిపోతున్నారని మార్గాని భరత్ చెప్పారు.