ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలకు చంద్రబాబే ఆధ్యుడని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎదుగుదలలో ప్రతి అడుగులోనూ ఆయన చేసిన కుట్రలు, కుతంత్రాలు కనిపిస్తాయని మండిపడ్డారు. రాయలసీమలో తన స్వార్థం కోసం హత్యాలను ప్రోత్సహించిన చరిత్ర చంద్రబాబు సొంతమని ధ్వజమెత్తారు.
తన 45 ఏళ్ల జీవితంలో హత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చంద్రబాబు ఇప్పుడు నీతులు వల్లించడం విడ్డూరంగా ఉంది. తాము శుద్ధపూసలన్నట్టు తండ్రీకొడుకులు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకులెవరో ప్రజలందరికీ తెలుసు. దానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. నిన్ను చంపితే దిక్కెవరు జగన్ అని చంద్రబాబు గతంలో హెచ్చరించలేదా? ఆయన హెచ్చరించినట్లుగానే వైయస్ జగన్‌పై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. వైయస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినప్పుడు చంద్రబాబే సీఎంగా ఉన్నాడనేది నిజం కాదా? ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ పై రాయితో దాడి చేసిన వారితో టీడీపీ నాయకులకు ఉన్న సంబంధం కూడా పోలీసుల విచారణలో బయటపడింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో పోలీసులను ఉద్దేశించి ‘తరమండి నా కొడుకుల్ని అంటూ రెచ్చగొట్టి దాడులు చేయించింది చంద్రబాబు కాదా? టీడీపీ నాయకులు చేసిన దాడుల కారణంగా ఒక పోలీస్ తన కంటి చూపును కోల్పోయాడు.