తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అనంతరం ఆర్డినెన్సు పై సంతకం కోసం రాజ్ భవన్‌కి ఫైల్ పంపించిన ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్సు పై సంతకం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం గెజిట్ ముద్ర వేసింది.
ఇటీవల కాలంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన హైడ్రాకు సంబంధించి చట్టబద్దత లేదని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కాసేపటి క్రితం గెజిట్ విడుదల చేసింది. ఇటీవల హైడ్రా పెద్ద ఎత్తున ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో కూల్చివేతలు చేపట్టింది. నీటి వనరులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ స్థలాలను కాపాడే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాను జీవో నెం.99 పేరుతో ఏర్పాటు చేశారు. దీనికి ఏజెన్సీని కూడా రూపొందించింది.