సచివాలయ వ్యవస్థను తొలి నుంచి పంచాయితీ సర్పంచులు వ్యతిరేకిస్తున్నారు. ఒక్కో గ్రామ సచివాలయంలో నియమించిన 11 మంది ఉద్యోగుల పైనా పర్యవేక్షణ లోపించిందని ప్రభుత్వం గుర్తించింది. వారి పైన నియంత్రణ లేక పోవటం, వారంతా వేర్వేరు శాఖల పరిధిలో పని చేయటం వంటి వంటివి ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. పంచాయితీ కార్యదర్శులు కేవలం జీతాల బిల్లులను సమర్పించేందుకే పరిమితం చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయాల సిబ్బందితోనే ప్రతీ నెలా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు అధికారులు వీరి విషయంలో ప్రభుత్వం ముందు పలు ప్రతిపాదనలు సిద్దం చేసారు.
సచివాలయాల పై సర్పంచులకూ కొన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా పంచాయితీకి ఒక సచివాలయం ఉండేలా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఒకే గ్రామం లో రెండు నుంచి మూడు సచివాలయాలు ఉన్నాయి. దీంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో పని లేకుండా పోతుంది. ఇలాంటి వారిని గుర్తించి వారి సొంత శాఖలకు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇక గ్రామాల్లో జనాభాకు అనుగుణంగా సచివాలయాలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.