జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మంచి ముహూర్తం చూసుకుని రాజ్ భవన్ లో నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే అందుకు ముహూర్తం మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు.
మరో ఐదు నెలల్లో ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి నాగబాబుకు ఫిక్స్ అయింది. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేక ముందుగానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేయాలా? అన్న విషయంపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మంత్రిగా ప్రమాణం బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నాగబాబు ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరవుతారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.