కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లో నీళ్లే మొదటి అంశమని తెలిపారు. నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. బనకచర్ల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించే ప్లాన్ జరుగుతోంది. గోదావరి బేసిన్ లో మనకు హక్కుగా రావాల్సిన నీళ్లపై అడగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. బనకచర్ల ద్వారా రాయలసీమకు 200 టీఎంసీలు తరలిస్తమంటే పట్టించుకోవడం లేదని సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ గతంలో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర నీళ్లకు ఏపీ, కర్ణాటక గండికొడుతున్నాయని అన్నారు. గోదావరి నీళ్లను పెన్నాకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అసలు ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియడం లేదని మండిపడ్డారు.