సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అని కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని ఇందుకు సీఎం చంద్రబాబు నిన్నటి ప్రజెంటేషన్ నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల ఎక్స్ వేదికగా విమర్శించారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని చంద్రబాబు నీతి సూక్తులు చెప్పారని పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలటని మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు అని షర్మిల మండిపడ్డారు.
నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని50 లక్షల మంది అన్నదాతలను వంచించారని 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని విమర్శించారు. పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే చంద్రబాబు ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం అని షర్మిల నిలదీశారు. సూపర్ సిక్స్ పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారం అని ప్రశ్నించారు. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే కదా అని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో రాష్ట్రాన్ని గాడిన పెడతామన్నది మీరేనని తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసమని షర్మిల ప్రశ్నించారు.