విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీ యజమాని, మంత్రి నారాయణను వెంటనే బర్తరఫ్ చేయాలని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్రా డిమాండు చేశారు. అనంతపురంలో నారాయణ కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఇటీవల చరణ్ అనే విద్యార్థి మృతిచెందిన ఘటనపై బుధవారం వైయస్ఆర్సీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా రవిచంద్రా మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. క్లాస్ రూమ్లో అందరితో పాటు కూర్చున్న విద్యార్థి ఒక్కసారిగా లేచి వెళ్లి, చెప్పులు విప్పేసి కారిడార్ నుంచి కిందకు దూకేశాడని, ఇందుకు కాలేజీ యాజమాన్యం ఒత్తిళ్లే కారణమన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్, కార్పోరేట్ విద్యా సంస్థల్లో ఆగడాలు అధికమయ్యాయని, ఫీజుల పేరుతో యాజమాన్యం దోపిడీ చేస్తూ, వేధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అండతో మంత్రి నారాయణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని రవిచంద్రా డిమాండు చేశారు.