ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలను చీటింగ్ చేశారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. సంపద సృష్టించాక సూపర్ సిక్స్ అమలు చేస్తామని చంద్రబాబు చావు కబురు చల్లగా చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సూపర్‌సిక్స్ అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీయాలని లోకేష్ చెప్పారని, ఇప్పుడు ఏ కాలర్ పట్టుకోవాలని ఆమె నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు అన్ని పథకాలు ఆపేశారని విమర్శించారు. నగరిలోని తన క్యాంపు కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారు. ఇలా చేయడం చంద్రబాబుకు కొత్తేమి కాదు. ఎందుకంటే పేదలంటే ఆయనకు చిరాకు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి 2014- 2019లో చంద్రబాబు కోత పెట్టడం మనందరం చూశాం. వైయస్ జగన్ సీఎం అయ్యాక అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయిన ఏడు నెలల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మ ఒడి, నాడు-నేడు పనులు, ఆరోగ్యశ్రీ పథకం, వాలంటీర్ వ్యవస్థను ఆపేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ లేదు. కనీసం డీఏ కూడా ఇవ్వడం లేదు. కూటమి నేతలు వైయస్ జగన్‌ను తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నారు కానీ, ఎన్నికల్లో చెప్పిన మాటలను గుర్తు పెట్టుకోవడం లేదు. అధికారంలోకి వస్తే మేం సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు. లోకేష్ అయితే సూపర్ సిక్స్ అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమని చెప్పారు. ఇప్పుడు ఏ కాలర్ పట్టుకోవాలి. చంద్రబాబు మాత్రం చావు కబురు చల్లగా చెబుతూ మేం సంపద సృష్టించిన తరువాత సూపర్ సిక్స్ అమలు చేస్తామంటున్నారు.