స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు కేవలం రెండు విడతల్లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఎలక్షన్స్ మూడు విడతల్లో నిర్వహిస్తే సిబ్బంది కొరత ఉండదని చెబుతుండగా అలా చేస్తే సమయం చాలా వృథా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చెప్పినట్లుగా సమాచారం. ఎన్నికల నిర్వహణకు అవసరం అయితే ఇతర శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో రెండు విడతల్లోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించబోతున్నట్లుగా స్పష్టం అవుతోంది. మరోవైపు గ్రామాల్లో సర్పంచ్ ఆశావహులు ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకం కావడంతో ఆ రిజర్వేషన్లఅంశాన్ని ప్రభుత్వం ఫైనల్ చేయనుంది. ఇప్పటికే అందు కోసం ప్రత్యేకంగా నియమించిన డెడికేటెడ్కమిషన్ రిపోర్టును వచ్చే నెల 2న ఇవ్వాల్సిందిగా సర్కార్ కమిషన్ సభ్యులను ఆదేశించింది. ఆ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి కేబినెట్‌కు రికమెండ్ చేయనుంది. అదేవిధంగా ఫిబ్రవరి 5న కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం లభించగానే, 7న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సభలో బీసీ రిజర్వేషన్‌లపై చర్చించి రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది.