బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి మొండిచెయ్యి..

mithun-reddy-01.jpg

కేంద్ర ఆర్థిక శాఖ మంత్ర నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మొండిచెయ్యి చూపార‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ ప‌క్ష నేత మిధున్‌రెడ్డి పెదవి విరిచారు. బిహార్ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు గానీ, పథకాలను గానీ కేటాయించకపోవడం వల్ల నిరాశను వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులపై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. `కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులను రాబట్టుకోవడంలో బిహ‌ర్ సీఎం నితీష్ కుమార్ స‌క్సెస్ అయ్యారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం అయ్యారు.

బడ్జెట్‌లో బిహార్‌కు బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయ్యి చూపించింది, ఇచ్చింది గుండుసున్నానే. దీనిపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెడికల్ సీట్లను భారీగా పెంచుతామని కేంద్రం చెబుతోండగా.. ఉన్న సీట్లు కూడా తమకు వద్దని, వాటిని రద్దు చేయాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖను రాసే దుస్థితి రాష్ట్రంలో ఉంది.  టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూటమి పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. సూప‌ర్‌సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోకపోవడం వల్ల వృద్ధిరేటు పడిపోయింది.  63 శాత మంది రైతులే ఉన్నారు, వాళ్లకు ప్రభుత్వం ఏం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు మైనస్‌లో ఉన్నాయి. రైతులు, ఎంఎస్ఎంఈ, చిరు వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాలు బాగున్నప్పుడే వృద్ధిరేటు సాధ్యపడుతుంది` అని మిధున్‌రెడ్డి చెప్పారు.

Share this post

scroll to top