ఈసారి కూడా కేంద్ర రైల్వే బడ్జెట్ రాష్ట్రంలోని దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రెడ్ సిగ్నలే చూపించింది. బడ్జెట్ రైలు రాష్ట్రాన్ని బైపాస్ చేసుకుంటూ వెళ్లిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో తీసుకువచ్చిన కొత్త రైల్వే ప్రాజెక్టులు అక్షరాలా శూన్యం. ఒక్కటంటే ఒక్క డిమాండ్‌ను కూడా రైల్వే శాఖ పట్టించుకోలేదు. రాష్ట్రం నుంచి ఎన్‌డీయేకు చెందిన 21 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నప్పటికీ, రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీ నుంచి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల గురించి వివరించారు. 2025–26 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,417 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అయితే ఆయన చాలా తెలివిగా 2009–10 వార్షిక బడ్జెట్ కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పడం విస్మయ పరిచింది. పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలుస్తూ ప్రసుత్త బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపలేదనే విషయాన్ని మరుగున పరిచేందుకు యత్నించారన్నది సుస్పష్టం. రైల్వే బడ్జెట్‌పై ఆ శాఖ పింక్ బుక్‌ను విడుదల చేస్తేనే కొంత స్పష్టత వస్తుంది.