తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఓవైపు ఎండవేడి, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. శుక్రవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక శనివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ వెలువరించింది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ జిల్లాలో 40.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత కనిష్టంగా భద్రాచలం లో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ ఇదే వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా శనివారం 42- 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెలువరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెలువరించది. ఇక ఆదివారం 7 మండలాల్లో తీవ్ర వడగాలులతో పాటు, 46 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.