ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ మయానా జకీయా ఖానమ్ బీజేపీ లో చేరారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆమె బుధవారం ఉదయం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జకియాకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి బీజేపీలో ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జకీయా ఖానమ్ రాజకీయ కుటుంబానికి చెందిన వారని, బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
జకీయా ఖానమ్ మాట్లాడుతూ బీజేపీలో చేరేందుకు తాను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మోడీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తండ్రి పాత్ర పోషిస్తున్నారని, ముస్లిం మైనారిటీల నుంచి తాను మంచి మెసేజ్ ఇవ్వడానికి బీజేపీలో చేరానని జకీయా తెలిపారు.