చాలా కాలంగా నటుడు విశాల్ పెళ్లి గురించి అనేక వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఎవరిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చింది. ఆయన సాయి ధన్సిక అనే నటిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి, విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ వంటి నటీమణులతో ప్రేమలో ఉన్నాడని, వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి విశాల్ సాయి ధన్సికతో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ రోజు సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటించిన ‘యోగిదా’ అనే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్‌కు విశాల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలోనే విశాల్, సాయి ధన్సికతో తన వివాహాన్ని ధ్రువీకరించారు. నటి సాయి ధన్సిక ఏకంగా వివాహ తేదీని కూడా ప్రకటించింది. ఆగస్టు 29వ తేదీన తాను విశాల్‌తో ఏడడుగులు వేయబోతున్నట్లు ఆమె వెల్లడించింది. దీంతో విశాల్ పెళ్లి గురించి ఎన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి స్పష్టత లభించినట్లయింది.