ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించిన ఆయన జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం అక్రమాలపై ఆధారాలు చూపాలని వైఎస్ జగన్ సవాల్ చేశారు. దీనిపై ఏమీ సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు చేతులు ఎత్తేశారని సెటైర్లు వేశారు. నిజంగా డేటా డిలిట్ చేస్తే దాని వెనుక మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నట్టే కదా? అని ప్రశ్నించారు. ఆధారాల్లేవని ఒకవైపు చెప్తూనే మరోవైపు బ్యాక్ఎండ్ లో ఉన్నాయని రాశారు. అంటే బ్యాక్ఎండ్లో మీకు కావాల్సినట్టు ఆధారాలు తయారు చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మద్యం కేసులో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు శైలజానాథ్. నిజంగా అక్రమాలు జరిగి ఉంటే బేవరేజ్ కార్పోరేషన్ అధికారులందరి మీదా ఎందుకు కేసులు పెట్టలేదు. అని ప్రశ్నించారు. డిస్టలరీల మీద కూడా కేసులు పెట్టి ఎందుకు విచారణ చేయలేదు? అని నిలదీశారు. ఆధారాలు లేకుండా కట్టుకథలు చెప్పటం మానాలని సూచించారు. ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జనాన్ని మోసం చేసినందునే వచ్చే నెల 4వ తేదీన వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నాం అని ప్రకటించారు. నిన్నటి ప్రెస్మీట్ లో జగన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్.