మనదేశంలో ముప్పై శాతం జనాభా అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మంది ప్రజలకు తమకు అధిక రక్తపోటు ఉన్నట్టు తెలియదు. తెలిసిన వారిలో దాదాపు సగం మంది ప్రజలకు చికిత్స సరిపడా తీసుకోక పోవడం వల్ల అది అదుపులోకి రావడం లేదు. గుండె సంబంధిత సమస్యలకు గల ముఖ్య కారణాల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక జబ్బులు.. సగటున అరవై ఏళ్ల వయసులో కనిపించేవి. ఈ మధ్య మాత్రం అవి ఒక దశాబ్ద కాలం ముందే, అంటే సుమారు యాభై ఏళ్ల వయసు నుంచే అధికంగా కనిపిస్తున్నాయి. సాధారణ రక్తపోటు 120/80. అయితే, 140/90 కన్నా ఎక్కువ రక్తపోటు ఉన్నప్పుడు, మూడు వేరు వేరు సందర్భాలలో పరీక్ష చేసి, రక్తపోటు ఉన్నట్టు నిర్ధారించి మందులు ప్రారంభిస్తారు. 120/80 నుండి 140/90 మధ్యలో రక్తపోటు ఉన్నట్టయితే, జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో తరచూ పరీక్ష చేసుకుంటూ ఉండాలి.
రక్తపోటుతో బాధ పడుతున్నారా..
