ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ తరుణంలోనే తీర్పు రాగానే ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దూకుడు పెంచారు. ఫార్ములా ఈ రేసుతో సంబంధం ఉన్న గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం ఆఫీసుల్లో ఏక కాలంలో రికార్డులను పరిశీలిస్తున్నారు.
కాగా, ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఇటీవల ప్రభుత్వం ఆరోపించింది. బీఆర్ఎస్ కు రూ.41 కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్ కో సంస్థ ముట్టచెప్పినట్లుగా వెల్లడించింది. ఆ కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ.కోట్ల లబ్ధి చేకూరినట్లు తెలిపింది. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు కలిసి 41 సార్లు దాదాపు రూ.49 కోట్లను బీఆర్ఎస్ పార్టీ కి చందాల రూపంలో ఇచ్చినట్లుగా గుర్తించింది. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్ల ను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లుగా వెల్లడైంది. ప్రతిసారి రూ.కోటి విలువ చేసే బాండ్లు గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసినట్లుగా ప్రభుత్వం ఆరోపించింది.