టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఘనంగా జరుగగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నటుడు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే తనకు పద్మభూషణ్ రావడంపై మీడియాతో స్పందించాడు బాలయ్య.
నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద సమయంలో నా అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే, భారత ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కొందరు అభిమానులు ఈ అవార్డు నాకు ఎప్పుడో రావాల్సిందని భావిస్తుండవచ్చు. వారికి నేను చెప్పేది ఒక్కటే నాకు ఈ పద్మభూషణ్ పురస్కారం సరైన సమయంలోనే లభించింది.
ఈ సంవత్సరం నాకు ఎంతో ప్రత్యేకమైనది. నేను నటించిన నాలుగు సినిమాలు వరుసగా సూపర్ హిట్ సాధించాయి. అంతేకాకుండా, నేను క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయింది. ముఖ్యంగా, నా సినీ జీవితం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఈ గౌరవం దక్కడం మరింత ఆనందంగా ఉంది. ఈ గుర్తింపు నాకు మరింత స్ఫూర్తినిస్తుంది. మీ అందరి ప్రేమ, అభిమానానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానంటూ బాలయ్య చెప్పుకోచ్చాడు.